న్యూఢిల్లీ: సీనియర్ మహిళా జర్నలిస్టును నోయిడా గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు యువకులు వెంటాడి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆఫీస్ నుంచి వసంత్ కుంజ్‌కు కారులో బయల్దేరిన ఆమెను స్కూటీపై వచ్చిన డీపక్, శుభమ్‌లు అడ్డగించి ఆపడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ కారణంగా కారు నెమ్మదించిన సమయంలో శుభమ్ దిగి విండ్షీల్డ్‌ను బలంగా కొట్టి, డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. తరువాత చెక్కతో కార్ రియర్ గాజులను పగలగొట్టాడు. భయపడినా జర్నలిస్టు ధైర్యంగా డ్రైవ్ చేస్తూ DND ఫ్లైవే దాకా చేరుకుని సహోద్యోగులకు సమాచారం అందించారు.
లజ్‌పత్ నగర్ ప్రాంతానికి చేరిన ఆమెకు అక్కడి ట్యాక్సీ డ్రైవర్లు సహాయం అందించడంతో దుండగులు పరారయ్యారు. వెంటనే పోలీసులకు కాల్ చేసి లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. దాడి చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, వారి మీద పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. మహిళా జర్నలిస్టుల భద్రత, రాత్రివేళ రోడ్డు సెక్యూరిటీపై ఈ ఘటన మరోసారి గంభీర ప్రశ్నల్ని లేవనెత్తింది.